Chandrababu: ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపు ఇది : చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi )లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి బీజేపీ (BJP)ని గెలిపించారు. దేశంలోని ప్రజలందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపు ఇది. దేశ, రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలి. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయి. సుస్థిర అభివృద్ధి విధానం ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. మన దేశానికి రైట్ టైమ్లో రైట్ లీడర్ మోదీ (Modi) అన్నారు.
ఆప్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. కొన్ని విధానాల వల్ల అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. వైసీపీ (YCP) పాలనలో ఏపీలో మద్యం మాఫియా తయారైంది. ఏపీ, ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదు. ప్రజల ఆకాంక్షలను వారు పట్టించుకోలేదు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారు. ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు. గుజరాత్ (Gujarat) లో సుస్థిర పాలనతో వృద్ధి 15 రెట్లు పెరిగింది. మంచి నాయకత్వంలో ముందుకెళ్తే 2027 నాటికి మన దేశమే నంబర్ వన్ అని చంద్రబాబు అన్నారు.













