రాబోయే రోజుల్లో అమరావతి ఓ పాఠ్యాంశం
అమరావతి నిర్మాణం, ఆ నగరాన్ని అభివృద్ధి చేసే విధానం రాబోయే రోజుల్లో ఓ పాఠ్యాంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో స్థానిక వనరుల ఆధారంగా పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కోస్తాంధ్ర లోనూ పారిశ్రామికావసరాలను గుర్తించాలన్నారు. ఈ మేరకు ఏపీసీఆర్డీఏ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టులాంటి భవనాల నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్నాయని, 2019 మార్చినాటికి కొలిక్కి వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.













