వరద బాధితులను ఆదుకోండి : చంద్రబాబు
గోదావరి వరద బాధితుల సహాయ చర్యల్లో తెలుగుదేశం కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలు, ముంపు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల తాగునీటి కొరతతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లోకి వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మిర్చి, అరటి తోటలు, కూరగాయాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలకు రాకపోకలు స్తంభించి ప్రజలు అవస్థలు పడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు ముందుకొచ్చి వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మానవసేవే మాధవసేవగా భావించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కనీస ధర్మమని చంద్రబాబు పేర్కొన్నారు.













