మెడికల్ హబ్‌గా మారనున్న అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రానున్న ప్రముఖ ఆసుపత్రులతో, విశ్వవిద్యాలయాలతో ఈ?ప్రాంతం త్వరలోనే మెడికల్ హబ్ గా పేరు తెచ్చుకోనున్నది. ఇప్పటికే ఇక్కడ, దాని పరిసర ప్రాంతాల్లో తమ ఆసుపత్రులు నెలకొల్పేందుకు పలు కార్పొరేట్ వైద్య సంస్థలు ముందుకు వస్తున్నాయి. మంగళగిరిలో ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 247 ఎకరాల విస్తీర్ణంలో రూ.1618 కోట్లతో ఎయిమ్స్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం 960 పడకలతో నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య నిపుణులు అందుబాటులులో ఉండనున్నారు. అదేవిధంగా వైద్య, శస్త్ర చికిత్సలకు సంబంధించిన స్పెషలిస్టులను నియమించనున్నారు. దీనికి అనుగుణంగా వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలికంగా విజయవాడ కేంద్రంగా ఈ కళాశాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడే ఆయుష్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అమరావతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పేందుకు దుబాయ్‌కు చెందినా బిఆర్ షెట్టీ, బ్రిటన్‌కు చెందిన ఇండో-యూకే సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంతో పాటు భూమిని కూడా కేటాయించనుంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో వందల సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి కాక మరో 30 నుంచి 35 వరకు కార్పొరేట్ వైద్య సంస్థలు సేవలందిస్తున్నాయి. ఎన్ఆర్ఐ, కాటూరి, సిద్దార్థ వైద్య కళాశాలలు రాజధాని ప్రజలకు చాలా కాలంగా అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరో రెండు మూడు వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ప్రభుత్వ వైద్య శాలల విషయానికొస్తే రాజధాని పరిధిలోని జంట నగరాలైన విజయవాడ, గుంటూరులోని సర్వజన ఆసుపత్రులు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆసుపత్రులను ఆధునీకరించటమే కాకుండా అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులను నియమించింది. అత్యాధునిక వైద్య పరికరాలను సైతం అందుబాటులోకి తీసుకు వచ్చింది. పేద ప్రజల కోసం సీటీ, ఎమ్మారై స్కాన్లకు సంబంధించిన మిషన్లను అమర్చింది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె, మూత్రపిండాల మార్పిడి లాంటి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు సైతం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న క్యాన్సర్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.20 కోట్లను పరికరాలు, నూతన భవన నిర్మాణానికి కేటాయించింది. కాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఫార్మా కంపెనీలు తమ శాఖలకు సర్జికల్ పరికరాలు, సామాగ్రి తయారు చేసే కంపెనీలు కూడా తమ బ్రాంచ్‌లను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. అమరావతి పరిపాలనా నగర పనులు ప్రారంభం అయిన వెంటనే మరికొన్ని వైద్య సంస్థలు, ఫార్యా కంపెలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నారైలు కూడా ఇక్కడ ఆసుపత్రుల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎయిమ్స్, మిగిలిన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే అమరావతి మెడికల్ హబ్‌గా రూపొందటమే కాకుండా రాష్ట్ర ప్రజానీకానికి విరివిగా వైద్య సేవలు అందే అవకాశాలు ఉన్నాయి.













