ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత : చంద్రబాబు
ఈ రోజు సోమవారం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అలాగే నీరు ప్రగతి, వ్యవసాయంపైనా ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయపనులు లేవు కాబట్టి, వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యేలోపు ఉపాధి పనులు ముమ్మరం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెలలోనే రూ.1,000కోట్లు విలువైన నరేగా పనులు చేయాలని సూచించారు. రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజలకు తాగునీటి కొరత లేకుండా, నీటి పథకాల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందిన ఘటనలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుల సమాచారం ముందే ఇస్తున్నా ఇంకా మరణాలు సంభవిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిడుగులతో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు.













