వచ్చే ఏడాదే అత్యంత కీలకం : చంద్రబాబు
వచ్చే ఏడాది అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాలన్నీ ఈ ఏడాదిలోపు పూర్తిచేయాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకు పనితీరును విశ్లేషించనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది అని ప్రతి ఒక్కరు గ్రహించాలని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలు సాఫల్యం చేస్తే మన సామర్థ్యం బయటపడుతుందని అన్నారు. పని విభజన చేసుకుని లక్ష్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఆవేశంలో తప్పు చేసినా, పొరబాటుగా తప్పు చేసినా తప్పు తప్పేనని అన్నారు. అధికారంలో ఉన్నామనే స్పృహ నేతల్లో ఎల్లవేళలా ఉండాలన్నారు. భేషజాలు వదులుకొని బృంద స్పూర్తితో పనిచేసి ప్రజాదరణను పొందాలన్నారు.













