ఇవి ఇలానే కొనసాగితే.. భవిష్యత్ లో ప్రజలు తిరుగుబాటు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో మహానీయుల విగ్రహాల ధ్వంసం కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసం లాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సావాంగ్కి లేఖ రారు. దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే చేశారు. ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. 2019 జూన్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు అధికార వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శనం అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా.బి.ఆర్ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు అలాంటి నేతల విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలకు అధికార పార్టీ గుండాలను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి అని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తగదన్నారు. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి దాడులను నియంత్రించవచ్చు అని అన్నారు.













