వారికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు
జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ పాలనలో రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని మండిపడ్డారు. కల్తీసారా వైసీపీ నేతలే విక్రయిస్తున్నారన్నారు. మద్యం పక్కా రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగన్ చేస్తున్నారని ఆరోపించారు. నాటు సారా నియంత్రించేవరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తమ పార్టీ తరపున కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున మొత్తం 26 కుటుంబాలకు సాయం చేయనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే దాకా టీడీపీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కల్తీసారా వల్ల 26 కుటుంబాలు వీధిన పడ్డాయి. వారంత అనారోగ్యంతో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నాటకాలాడుతున్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మం పోయింది. అభ్రత మధ్య ప్రజలు బతుకుతున్నారు అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు.













