ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని అరాచకాలు ఎప్పుడూ లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సీఈసీ అరోరాతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ నేరస్తులు చెబితే అధికారులను బదిలీ చేశారని, ఏపీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేశారని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని ధ్వజమెత్తారు. అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్ రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
వీవీప్యాట్లను లెక్కించడానికి 6 రోజుల పడుతుందని సుప్రీంకోర్టుకు ఈసీ ఎందుకు చెప్పింది? మా పోరాట ఫలితంగా వీవీప్యాట్లు వచ్చాయి. కానీ వీవీప్యాట్లపైనా నమ్మకం లేకుండా చేశారు. ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్లు కావాలి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన అవకతవకల్ని దేశానికి చాటిచెబుతాం. ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షం ఎందుకు మాట్లాడలేదు? ప్రతిపక్షమే హింస చేసింది కాబట్టి మాట్లాడలేదు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ప్రజలంతా తిరుగుబాటు చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చి ఓటు వేశారు అని చంద్రబాబు తెలిపారు.













