టీడీపీ ఎన్నికల శంఖారావం..
రాజమహేంద్రవరం మహానాడు వేదికగా టీడీపీ సమరశంఖం పూరించింది. మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ వరాలు గుప్పించింది. రాష్ట్రంలో దాదాపు సగభాగం ఓటు బ్యాంకు కలిగిన మహిళలను.. పార్టీవైపు ఆకర్షించేందుకు.. గట్టి హామీలే గుమ్మరించింది. పెరిగిన వంటగ్యాస్ తో చిన్న, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతనా 18 నుంచి 59 ఏళ్లలోపు ఆడపడుచులు ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికీ.. ఒకొక్కరికీ నెలకు 15 వందల రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చారు. చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులకు.. ఒకో విద్యార్థికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు.జిల్లా పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణన్నారు.
నిరుద్యోగ యువతకు నెలకు 3వేలిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బంపరాఫర్ ఇచ్చారు. ఇక రైతులకు సంవత్సరానికి 20వేలిస్తామని తెలిపారు.పేదలను ధనికులుగా మార్చేందుకు పూర్ టు రిచ్ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థి చిన్నాభిన్నమై.. అప్పులతో గడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుంటామన్నారు చంద్రబాబు. దీనిలో భాగంగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తొలివిడత మ్యానిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు.
జరగబోయేది కురుక్షేత్రయుద్ధమన్న చంద్రబాబు.. వైసీపీ కౌరవసేనను ఓడిద్దామంటూ.. గట్టిగానే సంకల్పించారు. జగన్ పాలనావైఫల్యాలను ప్రస్తావిస్తూ.. ముద్దుపెట్టి, ఒక్కఛాన్సంటూ అధికారం దక్కించుకున్నాడన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. అన్నిరంగాల్లోనూ పూర్తిగా వైఫల్యం కనిపిస్తోందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువమంది ఉన్నవారు.. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే .. సంక్షేమపథకాలు నిలిచిపోతాయంటూ వైసీపీ సోషల్ మీడియా, పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని తొలి మ్యానిఫెస్టోతో చంద్రబాబు తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వస్తే, ఇంకా మరిన్ని సంక్షేమపథకాలు అమలు చేస్తామన్నారు. నిధుల సంగతి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. దాని సంగతి తాము చూసుకుంటామన్నారు.గతంకన్నా ఎక్కువగా కష్టపడి మరింత సుపరిపాలన అందిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. మహానాడు సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోంది.













