కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే … ఎన్ఆర్ఐ ల సమస్యలు పరిష్కారిస్తాం : చంద్రబాబు

విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్యసామాన్యమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవాసాంధ్రులను కొనియాడారు. ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ ఎన్డీయే కూటమి గెలుపునకు పని చేయడం అద్వితీయమని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవి, గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల కృతజ్ఞతాపూర్వక విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వర్చువల్గా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానం తీసుకొస్తొం. గత అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వారి సంక్షేమంపై దృష్టి సారించకపోవడంతో వారి ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి.
గతంలో గల్ఫ్ దేశాల్లో ఎన్ఆర్ఐలు ప్రమాదాల బారినపడితే రూ.లక్ష, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు, న్యాయం సమస్యలు తలెత్తితే రూ.50 వేల చొప్పున సాయం అందించాం. దుబాయ్ తదితర దేశాల్లో శిక్షణలు ఇప్పించాం. వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సంక్షేమానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అశోక్ బాబు, పెమ్మసాని చంద్రశేఖర్, బుచ్చిరాంప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బూర్ల రామాంజనేయులు, బోడె ప్రసాద్, నన్నపేని రాజకుమారి, మన్నవ సుబ్బారావు, కోమటి జయరాం, వేమూరి అరవింద్లు పాల్గొన్నారు.











































































