TDP Mahanadu: టీడీపీ మహానాడు.. ప్రత్యర్థులపై చంద్రబాబు బలమైన స్ట్రాటజీ..
తెలుగుదేశం పార్టీకి (Telugu Desam party) 2024 ఎన్నికల్లో దక్కిన అద్భుత విజయాన్ని పురస్కరించుకుని, పార్టీ పండుగగా నిర్వహించే మహానాడు (Mahanadu ) ఎక్కడ జరగాలనే అంశంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించని టీడీపీ(TDP) , ఈసారి అక్కడే భారీ ఎత్తున నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మరో మలుపు తిరిగినట్లు కనిపిస్తున్నాయి. ఈసారి మహానాడును వైసీపీ (YCP) కంచుకోటగా పేరున్న పులివెందులలోనే (Pulivendula) నిర్వహించాలనే ఆలోచన తెరపైకి వచ్చింది.
పులివెందుల అనేది దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి (YS Family) కంచు కోట..అక్కడ వైఎస్ వర్గానికి తిరుగు లేదు. అయితే, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి కడప జిల్లాలో గణనీయమైన విజయాన్ని సాధించింది. పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాలను గెలుచుకుని, వైసీపీని కేవలం మూడుకు పరిమితం చేసింది. ఇది టీడీపీ ఖాతాలో గట్టి విజయంగా భావించవచ్చు. ఇలాంటి సమయాల్లో పార్టీ కార్యకర్తలకు మరింత ప్రేరణ ఇచ్చేలా, ప్రత్యర్థి శిబిరానికి గట్టి సంకేతం పంపించేలా మహానాడును పులివెందులలో నిర్వహించాలని నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం అమలైతే, అది రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీయడం ఖాయం. టీడీపీ విజయోత్సాహాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అవకాశం ఈ మహానాడు ద్వారా లభించనుంది. ఒకప్పుడు వైసీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కడప జిల్లాలోనే పెద్ద సభను నిర్వహించడం ద్వారా, “ఇక్కడ వైసీపీకి ఒంటరి ఆధిపత్యం లేదు” అని చెప్పే ప్రయత్నంగా టీడీపీ ఈ వేడుకను ఉపయోగించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇకపోతే, పులివెందులలో మహానాడు పెట్టే అంశంపై ఇప్పటికే టీడీపీ శ్రేణుల్లో చర్చలు మొదలయ్యాయి. మహానాడు నిర్వహించడానికి అనువైన ప్రదేశాలను పరిశీలించి అధినాయకత్వానికి పంపినట్లు తెలుస్తోంది. ఒకవేళ పులివెందులలో మహానాడు నిర్వహిస్తే, అది ప్రత్యర్థి శిబిరానికి పెద్ద షాక్ గా మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కేవలం ఒక పార్టీ సమావేశం మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేలా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, 2024 ఎన్నికల్లో దక్కిన విజయాన్ని మరింత ఘనంగా మలిచే దిశగా టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. మహానాడు ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు మాత్రం రాజకీయ వేడి పెంచుతున్నాయి. మే నెలలో జరిగే ఈ రాజకీయ మలుపు ఏవిధమైన ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.













