ఉచితాలే గట్టెక్కిస్తాయా?
దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఉచిత హామీల అమలే ప్రధానాస్త్రంగా బరిలోకి దిగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు … ఉచిత జపం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఉచిత హామీలను ప్రకటించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. విపరీతమైన ప్రజావ్యతిరేకతకు తోడు ఉచిత హామీల ప్రకటన.. కన్నడిగుల్ని ఆకట్టుకుంది. ఇంకేముంది కన్నడ సీఎంగా సిద్ధరామయ్య పదవి చేపట్టారు.
ఇప్పుడు అదేబాటలో తెలంగాణ కాంగ్రెస్ పయనిస్తోంది. ఉచిత అస్త్రాలను అమలు చేస్తామంటూ.. ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆపార్టీ అధినేతల ప్రచారంలోనూ ఉచితాల గురించి ప్రస్తావిస్తోంది. అదే సమయంలో బీజేపీ హయాంలో పెరిగిన ధరలను ప్రస్తావిస్తూ.. సామాన్య, మధ్యతరగతి ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కన్నడ బాటలో తెలంగాణలోనూ ఉచిత హామీలతో గెలుపుఖాయమని ఆపార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
ఇప్పుడు ఏపీలో విపక్ష టీడీపీ కూడా ఉచిత పథకాలను ప్రకటించేసింది. తొలి మ్యానిఫెస్టోలో చాలా ఉచితాలను ప్రస్తావించింది. దీంతో మరోసారి ఉచితాలపై అందరి దృష్టి పడింది. ఏడాదికి ఉచితంగా మూడు సిలెండర్లు, ఆడబిడ్డలకు 15 వందలు, జిల్లా పరిధిలోని బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నిరుద్యోగులకు నెలకు 3 వేలు .. ఇలా ఆపార్టీ అధినేత చంద్రబాబు ఉచితాలను ప్రస్తావించారు. దీన్ని అప్పుడే టీడీపీ సోషల్ మీడియా, తెలుగు తమ్ముళ్లు… ప్రచార పర్వంలోకి తీసుకెళ్లారు.
ఇప్పటికే పలు ఉచితాలను అమలు చేస్తున్న అధికార వైసీపీి.. ఇప్పుడు తన ఉచిత సంక్షేమపథకాల హామీలను మరింత పెంచే అవకాశముంది. దీంతో మరిన్ని ఉచితాలు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఓటర్లు ఉచిత హామీల వర్షంలో తడిసి ముద్దైపోనున్నారు. ఇంతకూ ఈ పథకాల ప్రభావం.. ఓటర్లపై ఎలా ఉండనుంది అంటే.. ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఉచితంగా డబ్బు, సంక్షేమపథకాలు అందుతాయంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఈ వీక్ నెస్ నే పార్టీలు అందిపుచ్చుకుని.. అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అయితే ప్రస్తుత గడ్డుకాలంలో ప్రకటించిన ఉచితాల అమలు ఎంతవరకూ సాధ్యమంటే మాత్రం ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.













