హైకోర్ట్ తీరుపై చలసాని హాట్ కీలక కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పు విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ డెయిరీ(vijaya dairy) ఛైర్మన్గా దాసరి బాలవర్ధన్రావుతో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, తలెత్తిన పరిణామాలపై చర్చించేందుకు నిర్వహించిన అత్యవసర బోర్డు సమావేశం కోరం సరిపడా లేకపోవడంతో వాయిదా పడింది. సమావేశం అనంతరం మాజీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బోర్డులో సమగ్రంగా చర్చించామని, ప్రస్తుతం కోరం లేనందున తుది నిర్ణయానికి రాలేకపోయామని తెలిపారు.
త్వరలోనే ప్రముఖ న్యాయ నిపుణుల ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకుని, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు పాటించలేదంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు.. ఛైర్మన్ దాసరి బాలవర్ధన్రావుతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల ఎన్నికను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యర్థుల నామినేషన్లను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించారన్న ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం హడావుడిగా ఎన్నికలు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, న్యాయపరమైన చిక్కులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్పష్టత ఇస్తామని చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. బోర్డులో ఎలాంటి అంతర్గత విబేధాలు లేవని, సహకార రంగంలోని ఈ సంస్థను మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తూ పాడి రైతుల సంక్షేమానికి కృష్ణా మిల్క్ యూనియన్ కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు. తమపై, బోర్డుపై వస్తున్న నిరాధార అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కోరం పూర్తికాగానే మరోసారి బోర్డు సభ్యులంతా సమావేశమై హైకోర్టు తీర్పుపై తదుపరి విధివిధానాలను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. కోర్టు తీర్పు మరియు తదనంతర పరిణామాల నేపథ్యంలో విజయ డెయిరీ భవిష్యత్తుపై పాడి రైతుల్లో మరియు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.







