Polavaram: చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం భవిష్యత్‌పై మట్టి పరీక్షల ప్రభావం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP Chief minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎంతో ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రాజెక్టులలో పోలవరం (Polavaram) ఒకటి. 2029 లోపల ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్మించి ప్రారంభించాలని ఆయన ధృఢనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం తరఫున వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ (Chairman of the 16th Finance Commission) అరవింద్ పనగాడియాకు (Arvind Panagariya)చంద్రబాబు ముందుగానే ఆహ్వానం ఇచ్చారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరు ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ భారీ ప్రాజెక్టుకు ఇప్పుడు మట్టి పరీక్షలు కీలకంగా మారాయి.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వరదలు, భూమిలోపల జరుగుతున్న మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మట్టిలో ఆకర్షణాశక్తి తగ్గినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది నిర్మాణాల భద్రతపై ప్రభావం చూపవచ్చని వారంతా అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలవనరుల శాఖ తరఫున మట్టిని పరీక్షించేందుకు నిపుణుల బృందాన్ని రెండు రోజుల క్రితం పోలవరం వద్దకు పంపారు. ఈ బృందం దండంగి, జలవిద్యుత్ కేంద్ర పరిసరాల్లో సహా అనేక ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించింది.
ఈ నమూనాలను స్థానికంగా నిర్వహించే పరీక్షలతో పాటు, మరింత ఖచ్చితంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్‌కు (Central Soil and Materials Research center)పంపించారు. అక్కడి నిపుణులు బి. సిద్దార్థ్ హెడావో (B. Siddharth Hedaoo), విపుల్ కుమార్ గుప్తా (Vipul Kumar Gupta), నిర్మల వంటి వారు పరిశీలన జరిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ఎక్కడ ఎలా నిర్మాణాలు చేపట్టాలన్న విషయంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
మట్టిలో నాణ్యత లోపం ఉంటే, అక్కడ నిర్మాణాలు ఎంత బలంగా చేసినా తక్కువ కాలమే నిలిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి నిర్మాణ స్థలంలో మట్టి గుణనిల్వలు పరీక్షించాలన్నది వారి అభిప్రాయం. నిర్మాణాల స్థిరత్వం కోసం ఈ పరీక్షలు తప్పనిసరి కావడం వల్లే ఈ స్థాయిలో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగేందుకు ప్రకృతి సహకరించడం ఎంత అవసరమో, మట్టిలో నాణ్యత ఉండడం కూడా అంతే కీలకమైంది. మరి ఈ పరీక్షల ఫలితాలపై ప్రాజెక్టు భవిష్యత్ ఆధారపడే అవకాశముంది.













