పొత్తు సంకేతాలు..?
ఎన్టీఆర్ వందో జయంతి సమయంలో స్మారకనాణెం విడుదల సందర్భంగా రాజకీయంగా ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ, బీజేపీ అగ్రనేతలు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం తటస్థించింది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇది ఓరకంగా వేడుకకు హాజరైనట్లు కనిపించినా.. రాజకీయఆసక్తిని రేపింది.
అసలే ఏపీ రాజకీయాలు ఎవరికీ అర్థం కానట్లుగా తయ్యారయ్యాయి. బీజేపీ హైకమాండ్ ఓవైపు వైసీపీతో సఖ్యతగా ఉంటోంది. జగన్ ఢిల్లీ వచ్చి అడగ్గానే నిధులు విడుదల చేస్తోంది.మరోవైపు.. టీడీపీ నేతలతోనూ కలిసి కనిపిస్తోంది. దీంతో అసలు ఏపీలో ఎవరు, ఎవరితో కలిసి పోటీ చేస్తారో అర్థం కాక.. రాజకీయ నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న జగన్ సైతం… బీజేపీ తమకు మద్దతివ్వకపోవచ్చని వ్యాఖ్యలు సైతం చేశారు.
అయితే ఢిల్లీలో జరిగిన స్మారకనాణెం విడుదల కార్యక్రమంలో పొలిటికల్ సీన్ చూస్తే .. రానున్న ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ జత కట్టొచ్చన్న సంకేతాలున్నాయి. వాస్తవానికి ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఏదో ఓపార్టీతో కలిసి నడవాల్సిందే. జగన్ కు క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉండడం.. దీనికి తోడు జనసేనాని సైతం టీడీపీ, బీజేపీ పొత్తుతో కలిసి రావాలని కోరడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇప్పుడు ఏపీలో వైసీపీ ఓవైపు.. టీడీపీ, బీజేపీ, జనసేన మరోపక్షంగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామం కాస్తా వైసీపీకి ఆందోళన కలిగిస్తోంది. అందుకే నగరి విద్యాదీవెన సభలో సీఎం జగన్ సైతం…. టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకులైన వ్యక్తులు.. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ ఆయన ఫోటోలు పెట్టుకుని ఓట్లడుగుతున్నారని ఆరోపించారు. ఓవైపు ఢిల్లీలో స్మారకనాణెం విడుదల జరుగుతుండగానే.. సీఎం జగన్ ఈవ్యాఖ్యలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది ఎక్కడకు దారి తీస్తుందా అన్న చర్చ అప్పుడే ఫ్యాన్ పార్టీలో మొదలైపోయింది.













