కాళ్లు పట్టుకోనైనా సాధించే నేర్పరితనం ఉండాలి.. ఉద్యోగ సంఘాలకు బొత్స హితవు
ఒక ప్రభుత్వంలో అవినీతి జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు, ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి తలదించుకోవాల్సి వస్తుందని, కానీ తమ ప్రభుత్వంలో ఆ బాధ లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ పాలన కొనసాగినన్నాళ్లు ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సిన పరిస్థితులు రావని ఆయన అన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత లేదని, ఏ సమస్యనైనా కూర్చుని పరిష్కరించుకోవాలని, తమ విధానం అదేనని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను జీఓఎంలో చర్చిస్తామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. తమ సమస్యలకు కాళ్లు పట్టుకుని అయినా పరిష్కారం సాధించే నేర్పరితనం ఉద్యోగ సంఘాలకు ఉండాలని, సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమని అభిప్రాయపడ్డారు. కానీ ఉద్యోగ సంఘాలు ఒకేసారి దండోపాయ సూత్రాలను పాటించడం సరికాదని, సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆదిమూలపు సురేష్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సర్వీస్ రూల్స్‌తో పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రమోషన్లకు రోడ్ మ్యాప్ సిద్ధమైందని, శానిటేషన్ ఉద్యోగులకు త్వరలోనే వారాంతపు సెలవును మంజూరు చేస్తామని వెల్లడించారు.













