ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట
నరసాపురం వైసీసీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీ రఘురామ విషయంలో అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు బొల్లినేని రాజగోపాల్ కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను తూ.చ. తప్పకుండా పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి తీర్పు ఇచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలను కలుసుకొనేందుకు రాష్ట్రానికి వస్తున్న తనను పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని, చట్ట నిబంధనలు పాటించేలా వారిని ఆదేశించాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి నిర్ణయాన్ని వెల్లడించారు.













