తిరుపతిలో క్యాన్సర్ ఆస్పత్రికి భూమిపూజ
ఆంధ్రప్రదేశ్లో మరో అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి పునాది రాయి పడింది. రాష్ట్రం నుంచి ఏటా 50 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్న తరుణంలో ప్రాణాలు హరిస్తున్న మహమ్మారిని తరిమి కొట్టేందుకు రంగం సిద్ధమైంది. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి భూమి పూజా చేశారు.
వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కేటాయించిన 25 ఎకరాల స్థలంంలో రూ.1000 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మొత్తం వెయ్యి పడకల గానూ తొలి దశలో 376 పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభిస్తారు. ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు క్యాన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా క్యాన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ హాజరయ్యారు.













