భరత్ కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి లోకేశ్ హామీ
నాలుగేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న పులిపాటి భరత్ (Pulipati Bharat) కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హామీ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన భరత్ ఐదేళ్ల కిందట అమెరికా (America)కు వెళ్లారు. ఏడాది తర్వాత హెపటో సెల్యూలార్ కార్సినోమా బారినపడిన ఆయన, అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో టెక్సాస్ (Texas)లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మాతృభూమికి వచ్చి కుటుంబసభ్యులతో గడపాలని ఉందని, అనారోగ్యం దృష్ట్యా ఎయిర్ అంబెలెన్స్ (Air Ambulance) సాయం అవసరమని పేర్కొంటూ భరత్ వీడియో విడుదల చేశారు. ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. భరత్ సోదరితో మాట్లాడానని వివరించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా ప్రయాణాలు చేయొద్దని వైద్యబృందం సూచించినట్లు తెలిసిందన్నారు. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిరంతరం సంప్రదిస్తుంటామని హామీ ఇచ్చారు.








