Visakhapatnam: విశాఖలో పీక్స్ కి చేరుకున్న కుర్చీలాట.. మరుగున పడిన బడ్జెట్..
విశాఖపట్నం మహా నగరంగా మారిన తరువాత జనాభా గణనీయంగా పెరిగింది. అనకాపల్లి (Anakapalli) , భీమునిపట్నం (Bhimilipatnam) మున్సిపాలిటీలు ఇందులో భాగమయ్యాక, జనాభా నలభై లక్షల వరకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రతీ ఏడాది నగర అభివృద్ధి కోసం జీవీఎంసీ బడ్జెట్ (GVMC Budget) ప్రవేశపెట్టడం ఆనవాయితీ. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ పై ఉహించని పరిస్థితి నెలకొంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ ఇప్పటి వరకు బడ్జెట్ ను ఆమోదించలేదు. మార్చి నెల చివరి దశకు చేరుకుంటుండగా, కొత్త ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలు ఇంకా ఖరారు కాలేదు. బడ్జెట్ లేనందుకు ప్రధానంగా రాజకీయ కారణాలే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం జీవీఎంసీ వైసీపీ ఆధీనంలో ఉంది. గత నాలుగేళ్లుగా బడ్జెట్ ను ఆ పార్టీనే ప్రవేశపెట్టింది. అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మేయర్ పదవిని తొలగించాలని రాజకీయ వ్యూహాలు అమలు అవుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మేయర్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా ఉండటం గమనార్హం. మరోవైపు కూటమి నేతలు జీవీఎంసీ అధికారం తమ చేతికి రావాలని భావిస్తున్నారు. మేయర్ ను తొలగించగలిగితే తామే కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టవచ్చని వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకే ఒకసారి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. రాజకీయంగా పైచేయి సాధించాలన్న ఉద్దేశంతోనే బడ్జెట్ ను ఆమోదించకుండా ఉంచినట్టు చర్చ జరుగుతోంది.
ఒకవేళ పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించలేకపోతే, తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ పద్ధతిలో నిధులను వినియోగించవచ్చా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. సాధారణంగా శాసనసభలు మాత్రమే ఈ విధానాన్ని అనుసరిస్తాయి. అయితే కార్పొరేషన్ లలో ఇది ఎంతవరకు సాధ్యమో అన్నది మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. మార్చిలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని అంటున్నారు.
కూటమి నేతలు త్వరలోనే మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో, ఈ ప్రక్రియను జిల్లాకలెక్టర్ ద్వారా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా, నగర అభివృద్ధికి అవసరమైన బడ్జెట్ ఇప్పటికీ ఆమోదం పొందకపోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బడ్జెట్ సమావేశం నిర్వహించాలంటే కనీసం వారం రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. కానీ ఇప్పటికి అందుకు తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్ పదవి మారినా, మారకపోయినా నగర అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ గందరగోళం కారణంగా బడ్జెట్ పై ఎవ్వరూ దృష్టి పెట్టట్లేదా అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.













