టీడీపీ ఎన్డీయేలో చేరబోతోందా..? బీజేపీతో పొత్తు ఖాయమైందా..?
కొంతకాలంగా దేశ రాజకీయాల్లో టీడీపీ – బీజేపీ పొత్తుపై చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీతో పొత్తుకోసం టీడీపీ తహతహలాడుతోంది. నాలుగేళ్లపాటు బీజేపీ పెద్దల అపాయిట్మెంట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో అనూహ్యంగా అమిత్ షా నుంచే పిలుపు రావడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి కలిసొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పటి నుంచి బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైందని.. ముఖ్యంగా తెలంగాణలో లబ్ది పొందేందుకు బీజేపీయే టీడీపీతో పొత్తు కోరుకుంటోందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పొత్తుల్లో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది.
బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అధికార వైసీపీపై అమిత్ షా, నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది వ్యూహంలో భాగమేనని ఇప్పుడు భావిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఆ లోటును పూడ్చుకోవాలంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు సరిపోరు. మరికొంతమంది మిత్రులను చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. వైసీపీని చేరమని బీజేపీ ఆఫర్ చేసినా జగన్ అందుకు నిరాకరించారు. తాము దూరంగానే ఉంటామని తేల్చి చెప్పేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి సీట్లు తగ్గుతాయని, టీడీపీ పుంజుకుంటుందని బీజేపీ నమ్ముతోంది. అందుకే టీడీపీని దగ్గరకు చేర్చుకోవడం ద్వారా కేంద్రంలో లబ్ది పొందవచ్చనేది బీజేపీ ఆలోచన.
వాస్తవానికి ఏపీపైన బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. అక్కడ సీట్లు వచ్చినా రాకపోయినా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదనే ఫీలింగులో ఉంది కమలం పార్టీ. కానీ తెలంగాణలో మాత్రం అధికారాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం లాంటి ఏరియాల్లో సీమాంధ్రులు తమకు అండగా నిలుస్తారని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికీ టీడీపీకి క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది. అది ఓటు రూపంలో మారితే బీజేపీకి లబ్ది చేకూరుతుంది. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకుంటోంది కాబట్టి టీడీపీని తెలంగాణలో పోటీ చేయవద్దనే హక్కు కోల్పోయింది. ఒకవేళ టీడీపీని సీమాంధ్ర పార్టీగా ముద్రవేస్తే ఇదే అంశాన్ని లేవనెత్తాలని అటు టీడీపీ, ఇటు బీజేపీ కౌంటర్ రెడీ చేసుకున్నాయి.
ఖమ్మంలో ఎల్లుండి అమిత్ షా పర్యటించనున్నారు. మోదీ 9 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించడంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే బీజేపీ ఎన్టీఆర్ జపం చేసేందుకు సిద్ధమవుతోంది. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మంచి పట్టుంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెడుతోంది. దీన్ని బట్టి బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు దాదాపు ఖాయమైందని అర్థమవుతోంది.













