Sri Reddy : ఎట్టకేలకు విచారణకు హాజరైన శ్రీరెడ్డి.. అరెస్టు తప్పదా..?
సినీ నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు ఆమె సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అయితే కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి (Sri Reddy) తన వైఖరిని మార్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌లను (Nara Lokesh) దూషించినందుకు క్షమాపణలు చెప్పారు. తన తప్పును ఒప్పుకుంటూ వీడియోలు, ఓపెన్ లెటర్ల ద్వారా క్షమించమని వేడుకున్నారు. అయినప్పటికీ, ఆమెపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు ఆమెను వెంటాడుతున్నాయి. తాజాగా, విజయనగరం జిల్లా (Vizianagaram) పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో (Pusapatirega Police Station) శ్రీరెడ్డి విచారణకు హాజరైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి ఇవాళ తొలిసారిగా విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఆమెపై కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు తన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆమెపై నమోదైన పలు కేసుల్లో ఇది ఒకటి మాత్రమే. విశాఖపట్నం, కృష్ణా, కర్నూలు, చిత్తూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
శ్రీరెడ్డి తనపై నమోదైన ఆరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 25, 2025న జరిగిన విచారణలో విశాఖపట్నం కేసులో ఆమెకు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరైంది. రూ.10 వేలతో ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే, చిత్తూరు కేసులో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని కేసుల్లో పోలీసులు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారేమోననే టాక్ నడుస్తోంది.
తొలిసారి శ్రీరెడ్డి పోలీసుల ముందు హాజరయ్యారు. తన వాదనను వినిపించారు. అయితే మున్ముందు ఈ విచారణల పరంపర కొనసాగే అవకాశం ఉందని సమాచారం. శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి కూటమి నేతలు, కార్యకర్తల్లో ఉంది. దీంతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారి పట్ల కఠిన వైఖరి అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే శ్రీరెడ్డిని విచారణకు పిలిచారు. మున్ముందు ఆమెను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.













