Posani: పోసానిపై పక్కా స్కెచ్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..!!
కూటమి నేతలపై (NDA) నోరు పారేసుకున్న కేసులో పోసాని కృష్ణ మురళిని (Posani Krishna Murali) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు ఆయన పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారం మాట్లాడారు. చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సహా వాళ్ల కుటుంబసభ్యులపై నీచాతినీచమైన భాషతో రెచ్చిపోయారు. వైసీపీ (YCP) ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళిపై దాదాపు 17 చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో పోసానిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారి పల్లె (Obulavari Palle) పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసు ఒక్కటే కాబట్టి త్వరగా బయటపడొచ్చు అని పోసాని భావించారు. పైగా పార్టీయే పోసాని కోసం న్యాయసహాయం చేయాలని నిర్ణయించింది. వైసీపీ ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) పోసాని కోసం వాదిస్తున్నారు. ఓబులవారి పల్లె కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఇంతలో పోసానిపై తమ పరిధిలో కేసు నమోదైందంటూ మూడు జిల్లాల పోలీసులు కోర్టులో పీటీ వారెంట్లు వేశారు. పోసానిని తీసుకెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాజంపేట జైలు (Rajampet Jail) అధికారుల ముందు పల్నాడు (Palnadu), అల్లూరి సీతారామరాజు (Alluri), అనంతపురం (Anantapuram) జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లు ఉంచారు.
ఒకేసారి మూడు జిల్లాల పోలీసులు పోసానికోసం పోటీ పడడంతో జైలు అధికారులు విస్తుపోయారు. చివరకు ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట (Narasarao Pet) పోలీసులకు పోసానిని అప్పగించారు. ఆ పోలీసుల విచారణ పూర్తయ్యే లోపు అనంతపురం, అల్లూరి జిల్లా పోలీసులు ఇప్పటికే వారెంట్లతో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈసారీ ఆ జిల్లాలకు పోసానిని తరలించే అవకాశం ఉంది. ఈలోపు మిగిలిన జిల్లాల వాళ్లు కూడా పీటీ వారెంట్లు వేస్తే ఆయా జిల్లాలకు కూడా పోసానిని తీసుకెళ్లడం ఖాయం. ఈ తతంగమంతా పూర్తి కావాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేం. కాబట్టి ఇప్పట్లో పోసాని బయటకు రావడం కష్టమే అనిపిస్తోంది.
ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఆయనకు బెయిల్ వచ్చినా మిగిలిన పోలీస్ స్టేషన్ల పీటీ వారెంట్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పోసాని.. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్టు సమాచారం. తప్పయిపోయింది రాజా.. అంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నారని టాక్. అయినా కూటమి ప్రభుత్వం పోసాని లాంటి వాళ్లను క్షమించేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి పోసాని ఇప్పట్లో బయటకు రావడం కష్టమే.!













