పోలవరం పాపం ఎవరిది..? బాధ్యత ఎవరు తీసుకుంటారు..?
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశ అవసరాలు కూడా తీరగలవనే ఒక నమ్మకం ఉండేది. నదుల అనుసంధానంలో పోలవరం ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తూ వస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్టు విడిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. అయితే పదేళ్లయినా పూర్తి కాకపోగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీనిపై అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడానికే సరిపోతోంది.
పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు. అయితే ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టు పెద్దగా ముందుకు సాగలేదు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉండడంతో ఈ ప్రాజెక్టు శరవేగంగా అడుగులు వేసింది. 2014 నుంచి 2019 వరకూ దాదాపు 72 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అప్పటికే కుడి, ఎడమ కాలువలు ఒక దశకు రావడంతో ఒకటి రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అందరూ అనుకున్నారు.
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశాల్లో ఒకటిగా చేర్చకోలేదు. ఆ పార్టీ నేతల ప్రకటనలు మాటలకే పరిమితం అయ్యాయి తప్ప చేతల్లో కనిపించలేదు. పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ ద్వారా ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని చెప్పి తమకు అనుకూల కాంట్రాక్టర్ కు పనులు అప్పగించింది. కేంద్ర జలవనరుల శాఖ అభ్యంతరాలను లెక్కచేయకుండా ముందుకెళ్లింది. ఇదే సమయంలో వరదలు రావడంతో కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నాయి. నాడు టీడీపీ ప్రభుత్వం నాసిరకంగా పనులు చేయడం వల్లే వరదలకు ఇవి కొట్టుకుపోయాయాని టీడీపీ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేందుకు వైసీపీ ప్రయత్నించింది. వరదలు వస్తాయని తెలిసినా కూడా వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోగా మళ్లీ ముందుకొచ్చాయి.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోంది. సీఎం చంద్రబాబు దీని పరిస్థితి తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. దీంతో వీటిని మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల సమయంతో పాటు డబ్బు వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండేళ్లలో పూర్తవుతుందనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు కనీసం నాలుగేళ్లు పడుతుందని క్లారిటీ ఇచ్చారు.
ఇవన్నీ పక్కన పెడితే ప్రజాధనంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం ద్వారా ఎంతో నష్టం చేకూరింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. వాస్తవానికి ఇది జాతీయ ప్రాజెక్టు. అయితే దీన్ని తాము నిర్మించుకుంటామని టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు పదేళ్లు పూర్తయింది కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. అప్పటి అంచనాల ప్రకారం మాత్రమే తాము డబ్బులిస్తామని కేంద్రం చెప్తోంది. కానీ అప్పటికీ ఇప్పటికీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రాజెక్టుకు నష్టం కూడా వాటిల్లింది. దీంతో భారం మరింత ఎక్కువైంది. మరి దీన్ని ఎవరు భరిస్తారు..? ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది..?













