పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు అందరి చూపూ విపక్షాల పైనే ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే స్పష్టం చేసింది. తాము పొత్తులకు వ్యతిరేకమని.. ఏదైనా ఒంటరిగానే తేల్చుకుంటామని తేల్చేసింది. దీంతో ఇప్పుడు అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఏంచేస్తాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే ఆ మూడు పార్టీలు అధికారికంగా పొత్తులపై మాట్లాడలేదు. అయితే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా.. లేకుంటే టీడీపీ, జనసేనతో కలుస్తుందా అనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానం లేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో ఇవాళ జరుగుతున్న ఎన్డీయే సమావేశానికి జనసేనానికి కూడా ఆహ్వానం అందింది. బీజేపీతో జనసేన కలసి పని చేస్తుండడంతో పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి వెళ్లే ముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని తాను భావిస్తున్నట్టు పవన్ చెప్పారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య అవగాహనలోపం ఉందన్నారు. వాళ్ల సమస్యలపై తాను మాట్లాడలేనని.. కానీ కచ్చితంగా కలిసి పోటీ చేస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ విధానమన్నారు.
పవన్ కల్యాణ్ కామెంట్స్ తో ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. టీడీపీతో కలిసి పనిచేయడం తమకు కొత్త కాదన్నారు. 2014లో కలిసే పనిచేశామని.. 2019లో విడిపోయామని చెప్పారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. పొత్తులపై మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిపైన కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగానే ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అభిమానులు తనను సీఎంగా చూడాలనుకుంటున్నారని.. అయితే అది పెద్ద సమస్య కాబోదన్నారు. ఇప్పుడు తమ ముందున్న ఏకైక లక్ష్యం వైసీపీని ఓడించడమేనన్నారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ ద్వారా వాళ్ల కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. మరి బీజేపీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.













