పవన్ కల్యాణ్‌ను బీజేపీ పక్కన పెడుతోందా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో 9 నెలల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. వైసీపీ, టీడీపీ ఇప్పటికే ప్రజల్లో వివిధ కార్యక్రమాల పేరుతో తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 14 నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ బరిలోకి దిగినట్టే. వైసీపీ, టీడీపీ ప్రస్తుతానికి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. బీజేపీ – జనసేన మాత్రం కలిసి ఉన్నాయి. అయితే వాళ్ల మధ్య గ్యాప్ రోజురోజుకూ పెరుగుతున్నట్టు అర్థమవుతోంది.
2019 ఎన్నికల సమయంలో జనసేన – బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. అప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య అది అలాగే కొనసాగుతోంది. ఆరంభంలో చాలా కార్యక్రమాలు ఉమ్మడిగా చేసిన దాఖలాలున్నాయి. అయితే ఆ తర్వాత వేటికవే వాటి పనులు చేసుకుంటూ పోతున్నాయి. పొత్తు ఉందని నేతలు పైకి చెప్తున్నా ఉమ్మడిగా ఏ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. వైసీపీని దించడమే లక్ష్యంగా జనసేన పని చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్తుంటే.. మిత్రపక్షమైన బీజేపీ అధికార పార్టీకి అన్ని విధాలా అండదండలు అందిస్తోంది. ఇది పవన్ కల్యాణ్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే బీజేపీతో అంటీ ముట్టనట్టే ఉంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసేందుకు టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుందామని బీజేపీకి పవన్ కల్యాణ్ సూచించారు. అయితే బీజేపీ హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోవాలని డిసైడయ్యారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో చంద్రబాబు వెళ్లి అమిత్ షాను కలవడంతో మళ్లీ కూటమిపై ఆశలు మొలకెత్తాయి. టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి పోటీ చేయొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఏ పార్టీ నుంచి కూడా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ విషయాలను పక్కన పెడితే గతంలో లాగా బీజేపీ పవన్ కల్యాణ్ ను పట్టించుకోవట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో రాష్ట్రానికి పెద్దనేతలు ఎవరు వచ్చినా పవన్ కల్యాణ్ ను పిలిపించి మాట్లాడేవారు. గతంలో ప్రధాని మోదీ వైజాగ్ వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ రేపు రాష్ట్రానికి నడ్డా, అమిత్ షా వస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వాళ్లు వస్తున్నారని, అందుకే పిలవట్లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే గతంలో పార్టీ కార్యక్రమాలకు వచ్చినా పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. దీంతో పవన్ ను బీజేపీ దూరం పెడుతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి.













