అవినాశ్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా.. బెయిల్ పిటిషన్ లో సంచలన విషయాలు!
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసును ఈ నెలాఖరు లోపు క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ స్పీడ్ పెంచింది. నిన్న కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేసింది. ఇవాళ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలిచింది. అయితే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రేపు విచారణకు రావాలంటూ సీబీఐ అవినాశ్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. అయితే అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన మందస్తు బెయిల్ పిటిషన్ లో సంచలన విషయాలు ప్రస్తావించారు.
వివేకా హత్య కేసు ప్రస్తుతం వై.ఎస్.అవినాశ్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. సీబీఐ ఆయనకు ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతోందనే సమాచారం అందుతోంది. తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం, తనకు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో తదుపరి అరెస్టు తానేనని అవినాశ్ రెడ్డి భావిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయమే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. విచారణను సాయంత్రానికి వాయిదా వేసింది. 5 గంటల వరకూ అవినాశ్ ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. దీంతో అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు బయలుదేరారు.
ఇంతలో సీబీఐ నుంచి అవినాశ్ రెడ్డికి మెసేజ్ వచ్చింది. ఇవాళ విచారణకు రావాల్సిన అవసరం లేదని, రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కోరింది. దీంతో అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి రాకుండానే వెనుదిరిగారు. అయితే ఉదయం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో అవినాశ్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. గతంలో తనను అనుమానితుడిగా పిలిచి ఇప్పుడు నిందితుడిగా చేర్చారని, దీని వెనుక కుట్ర ఉందని పేర్కొన్నారు. వివేకా కుమార్తె సునీత, చంద్రబాబు కుమ్మక్కై తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. వివేకా కుమార్తె సునీతకు, రెండో భార్యకు మధ్య ఆర్థిక లావాదేవీల అంశంపై గొడవలు ఉన్నాయన్నారు. బెంగళూరులో వివేకానంద రెడ్డి అనేక ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారని, ఈ కేసులోని ఇద్దరు నిందితుల కుటుంబసభ్యులతో వివేకాకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు.
అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో పేర్కొన్న అంశాలు సంచలనం కలిగిస్తున్నాయి. వివేకాను అవినాశ్ రెడ్డి కుటుంబమే హత్య చేసిందనేలా సీబీఐ ఆధారాలు సంపాదించింది. నిందితులంతా అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ వైపే వేలెత్తి చూపుతున్నారు. దస్తగిరి అప్రూవర్ మారడాన్ని కూడా అవినాశ్ రెడ్డి తప్పుబట్టారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. అయితే అవినాశ్ రెడ్డి మాత్రం రెండో భార్యకు, మొదటి భార్య కుటుంబానికి మధ్య గొడవల వల్లే వివేకా హత్యకు గురయ్యారని చెప్తున్నారు. మరోవైపు.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కూడా వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు.













