ఆపద్బాంధవుడిగా మారుతున్న లోకేశ్..! ఇలా ఎంతమందికి..!?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నారా లోకేశ్ ఆపద్బాంధవుడిగా మారుతున్నారు. అడిగిన వాళ్లందరికీ సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేశ్.. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను తానే స్వయంగా దగ్గరుండి పరిష్కరించేందుకు సమయం వెచ్చిస్తున్నారు. అయితే మంగళగిరికి చెందిన వాళ్లే కాదు. దేశవిదేశాల్లోని పలువురు తమను కూడా ఆదుకోవాలంటూ లోకేశ్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో లోకేశ్ వాళ్లందరికీ తానున్నానంటూ భరోసానిస్తున్నారు.
గల్ఫ్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్లకు నారా లోకేశ్ అండగా నిలుస్తున్నారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లికి చెందిన షేక్ హసీనా సౌదీ అరేబియాలో ఇబ్బందులు పడుతోంది. తనను టార్చర్ పెడ్తున్నారని.. ఇండియాకు పంపట్లేదని ఆమె చెప్పారు. దీంతో తనను తీసుకొచ్చే బాధ్యత తనదని లోకేశ్ భరోసా ఇచ్చారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన కాశీ జ్యోతి అబుదాబిలో తాను ఇబ్బందుల్లో ఉన్నట్టు చెప్తూ వీడియో విడుదల చేసింది. తనను ఇండియాకు తీసుకెళ్లాలని లోకేశ్ ను అభ్యర్థించింది. ఆమెకు కూడా లోకేశ్ అండగా నిలిచారు.
అంతకుముందు అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శివ కువైట్ లో ఇబ్బందులు పడుతూ ఓ వీడియో పెట్టారు. ఎలాగైనా తనను ఇండియా తీసుకెళ్లాలని కోరారు. దీంతో లోకేశ్ చొరవ తీసుకుని శివను ఇండియా తీసుకొచ్చారు. ఆ తర్వాత వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి కూడా ఇలాంటి కారణాలతోనే వీడియో విడుదల చేశారు. ఆయనకు కూడా లోకేశ్ అండగా నిలిచారు. లోకేశ్ అందరికీ సాయం చేస్తున్నారని గ్రహించిన ఇలాంటి బాధితులు ఎంతోమంది ఇప్పుడు ముందుకొస్తున్నారు. తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. వాళ్లందరికీ లోకేశ్ తానున్నానంటూ భరో ఇస్తున్నారు. లక్నో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఓ విద్యార్థికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఆ విద్యార్థికి అవసరమైన ఫీజు తాను భరిస్తానని ముందుకొచ్చారు. ఫీజు గురించి ఆలోచించడం మానేసి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలా ఎంతోమందికి లోకేశ్ అండగా నిలుస్తున్నారు.
కానీ ఇలా ఎంతమందిని లోకేశ్ ఆదుకుంటారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రోజుకొకరో ఇద్దరో ఇలాంటి వీడియోలు విడుదల చేస్తూ తమను ఆదుకోవాలని లోకేశ్ ను కోరడం.. ఆ వెంటనే ఆయన భరోసా నివ్వడం చకచకా జరిగిపోతున్నాయి. వీళ్లను చూసి మరికొంతమంది ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు అడిగిన వాళ్లందరికీ చేస్తున్నారు. రేపు నెంబర్ పెరిగితే లోకేశ్ సాయం చేయగలరా అనేది డౌటే. ఒకవేళ చేయకపోతే చేయలేదని విమర్శిస్తారు. అందుకే ఇలా వ్యక్తిగత సాయం కాకుండా ప్రభుత్వం తరపున ఏదైనా యంత్రాంగం ఇలాంటి వారికోసం రూపొందిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. ఆ దిశగా అడుగు వేస్తే లోకేశ్ పై భారం తప్పుతుంది.













