వైసీపీకి మూకుమ్మడిగా షాక్ ఇవ్వబోతున్న కృష్ణా జిల్లా నేతలు..!?
ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది అధికార వైసీపీ. ఇప్పటికే నాలుగు విడతలుగా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది పార్టీ. చివరి నిమిషంలో ఏదైనా అవంతరాలు ఎదురైతే తప్ప వాళ్లే వైసీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. అయితే ఈ జాబితాల్లో చాలా మంది సిట్టింగులకు చోటు దొరకలేదు. తర్వాత జాబితాల్లో కూడా తమ పేర్లు ఉంటాయనే నమ్మకం కొంతమందికి లేదు. దీంతో అలాంటి నేతలంతా సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. తమకు ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే అందులో చేరిపోయేందుకు రెడీ అవుతున్నారు.
ఇలా టికెట్లు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న వాళ్లలో ఎక్కువగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కనిపిస్తున్నారు. ఇక్కడ ముగ్గురు సిట్టింగులకు సీట్లు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. దీంతో వీళ్లు ముగ్గురూ పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న తమకే సీట్లు నిరాకరిస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు పెనమలూరు ఎంపీ కొలను పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు సీట్లు ఇవ్వలేదు జగన్. దీంతో ఆయన పట్ల వీళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీళ్లందరినీ దారిలోకి తెచ్చుకునేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరోవైపు.. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే అక్కడ వేరే అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ. దీంతో జంగా కృష్ణమూర్తి ఏమాత్రం హ్యాపీగా లేరు. ఇలాంటి అసంతృప్తులంతా ఇప్పుడు ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు ఎలీజా, రక్షణనిధి.. పార్థసారథితో భేటీ అయ్యారు. దీంతో వీళ్లంతా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ ఏపీలో జోరుగా వినిపిస్తోంది. అయితే ఇందుకు మూహూర్తం కూడా ఖరారైనట్టు తాజాగా తెలుస్తోంది.
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పటికే తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేతతో కూడా భేటీ అయ్యారు. 21న చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతారని సమాచారం. అదే రోజు మిగిలిన ముగ్గురు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎలీజా, రక్షణనిధి, జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే అధికార వైసీపీకి గట్టి దెబ్బగానే చెప్పవచ్చు. ఒకేరోజు నలుగురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడడం మంచి సంకేతాలివ్వదు.













