Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టనున్నారా..?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారన్న ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ (TDP) కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయన తాజా వ్యాఖ్యలు, సినిమా ఈవెంట్లలో మాట్లాడిన తీరు, అభిమానుల కార్యకలాపాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన రాజకీయ అరంగేట్రంపై మీడియాలో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల వార్-2 (war 2) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నా తాత నందమూరి తారకరామారావు ఆశీస్సులు నాకుంటే ఎవరూ నన్ను అడ్డుకోలేరు” అని చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దివంగత నందమూరి తారకరామారావు (NTR) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన వారసత్వాన్ని ప్రస్తావించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ఆసక్తిని తెలియజేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ (TDP) తరపున ప్రచారం చేసి, యువతను ఆకర్షించారు. అయితే, ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. పార్టీలో ఆయనను పక్కనపెట్టారా లేక ఆయనే స్వయంగా తప్పుకున్నారా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, ఇప్పుడు ఆయన ప్రవర్తన, మాటలు, సినిమా డైలాగులు రాజకీయ రంగప్రవేశానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. వార్-2 సినిమాలోని ‘వాడుకుని పక్కన పెట్టే అవసరం లేదు’ అనే డైలాగ్ 2009లో టీడీపీ తీరుని తెలియజేస్తోందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ‘ఒక మనిషి అహాన్ని గాయపరిస్తే, ఎంతకైనా వెళ్ళిపోతాడు’ అనే మరో డైలాగ్ టీడీపీతో తన వేభేదాలను తన భవిష్యత్ లక్ష్యాన్ని సూచిస్తోందని భావిస్తున్నారు.
మరోవైపు.. విజయవాడలో ఎన్టీఆర్ అభిమానులు “CM NTR” అనే బ్యానర్లు పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ బ్యానర్లు ఆయన రాజకీయ రంగప్రవేశానికి సంకేతమని భావిస్తున్నారు. అదే సమయంలో, టీడీపీ నాయకుడు నారా లోకేష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “కూలీ” సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం, ఎన్టీఆర్ “వార్-2” ను ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేరుతో కొత్తగా “NTR తెలుగు దేశం” అనే పార్టీని స్థాపించే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినట్లు, ఎన్టీఆర్ కూడా తన తాత పేరుతో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావచ్చని అంటున్నారు. ఇది ఆయన అభిమానులకు, రాజకీయ ఆసక్తి ఉన్నవారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది. మరి ఆయన రాజకీయ పార్టీ పెడతారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.