సమస్యల వలయంలో జగన్ ఉక్కిరి బిక్కిరి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు, మరోవైపు కోడి కత్తి కేసు, ఇంకోవైపు పార్టీ పరిస్థితి ఆయన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటినుంచి బయటపడేందుకు ఎంత ట్రై చేస్తున్నా అవి కొలిక్కి రావట్లేదు. పైగా రోజురోజుకు మరింత ఊబిలోకి తీసుకెళ్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకుంటున్నారు.
బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు తన ఇంటి మెడకే చుట్టుకుంటుందని జగన్ అసలు ఊహించలేదు. ఇదంతా వివేకానంద రెడ్డి రెండో భార్య మెడకు లేదంటే టిడిపి నేతల హస్తానికో చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి అది వైయస్ ఫ్యామిలీని ఇరికించింది. మరో బాబాయ్ వైయస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో సూత్రధారులని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయగా నేడో రేపో అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమని జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. సిబిఐ ఒకవైపే చూస్తోందని ఇంకోవైపు చూడట్లేదని వైయస్ ఫ్యామిలీ కుంటున్నా అది అరణ్య రోదనే అవుతుంది. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు సిబిఐ అరెస్టులు చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఎక్కడ తన గడప తొక్కుతుందోనని జగన్ ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు కోడి కత్తి కేసు కూడా ఇలాగే తయారయింది. తనను చంపేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారని అందుకే తనపై కోడి కత్తితో దాడి చేశారని జగన్ కేసు పెట్టారు. ఈ దిశగా విచారించిన ఎన్ఐఏ ఈ కేసులో కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అసలు దీని వెనుక కుట్ర లేదని తేల్చేసింది. టిడిపి నేతల ప్రమేయం ఉందని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. పైగా ఈ కేసులో జగన్ నేరుగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇది కూడా జగన్కు సమస్యగా మారింది.
మరోవైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గొప్పగా లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది నిరూపితమైంది కూడా. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని భావిస్తున్నారు. ఎంత చేస్తున్నా తన వైపు ప్రజలు లేరనే వార్తలను జగన్ నమ్మలేకపోతున్నారు. ఇంతకంటే ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒక దానికి ఒకటి జగన్ చుట్టూ అనేక సమస్యలు పేరుకు పోతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ట్రై చేస్తున్నా ఒక కొలిక్కి రావట్లేదు.













