పార్టీలు రాజకీయమే చేస్తాయి జోగయ్య గారూ..!
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ, టీడీపీలకు సమాన దూరంలో ఉంటూ ఎదగాలని సూచించారు. అప్పుడే జనసేనకు, పవన్ కల్యాణ్ కు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అంతేకాక.. జనసేనను ఎదగనీయకుండా టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కన్నా లక్ష్మినారాయణ, మహాసేన రాజేశ్ జనసేనలో చేరకుండా టీడీపీ అధ్యక్షుడు ఎత్తులు వేశారని చెప్పారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయం అంటేనే ఎత్తులు, పైఎత్తులు. ఆ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండాకులు ఎక్కువే చదివారు. రాజకీయ చాణక్యంలో ఆయన తర్వాతే ఎవరైనా. అలాంటిది ఆయన ఎత్తులు, పైఎత్తులు వేయరనుకోవడం మీ అవివేకం. టీడీపీకి లబ్ది చేకూర్చేందుకు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయనకుండే వ్యూహాలు ఆయనకు ఉంటాయి. అందులో భాగంగానే ఆయన పార్టీకోసం ఎలాంటి ఎత్తులైనా వేస్తారు. రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. వాటిని తట్టుకోవాల్సిన బాధ్యత ఇతర పార్టీలదే.
టీడీపీ ఎత్తులు పైఎత్తులు వేస్తోందని ఆరోపించడం మాని.. వాటిని ఎదుర్కొనేందుకు జనసేన ఏం చేస్తుందనేదానిపై దృష్టి పెడితే బాగుంటుంది. రాజకీయ పార్టీలు స్వచ్చంధ సంస్థలు కావు. పోతీ పోనీలే అనుకోవడానికి. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి… చేయాలి కూడా. కన్నా, మహాసేన రాజేష్ ను జనసేనలో చేరకుండా అడ్డుకోవడం ఎత్తయితే అది టీడీపీ దృష్టిలో కరెక్టే. జనసేన ఆ ఎత్తులకు పైఎత్తులు వేసి రాజకీయం చేయాలి. అప్పుడే పార్టీ మనుగడ సాధించగలుగుతుంది. అలా కాకుండా ఎదుటి పార్టీలపై పడి ఏడుస్తుంటే జనసేన ఎప్పటికీ ఇలాగే ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది.
అయినా జనసేన తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నట్టు ఉంది. హరిరామ జోగయ్య కూడా జనసేన గ్రౌండ్ రియాలిటీ తెలియక ఇలా మాట్లాడుతున్నారనిపిస్తోంది. టీడీపీతో పొత్తు ఉండదని తెలిస్తే జనసేనలో చేరేందుకు ఇప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవచ్చు. టీడీపీతో కలిసి వెళ్తుందనే ప్రచారం జరుగుతుండడం వల్లే ఇప్పుడు జనసేనకు క్రేజ్ పెరిగింది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది.













