క్రాస్ రోడ్స్ లో చంద్రబాబు..! పొత్తులపై ఏం చేయబోతున్నారు..?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ను ఓడించాలనే పట్టుదల విపక్షాలన్నింటిలోనూ కనిపిస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉంటే గెలుస్తామనే నమ్మకం కూడా ఉంది. టీడీపీ, జనసేనకు ఈ విషయంలో పక్కా క్లారిటీ ఉంది. బీజేపీ కూడా తమతో కలసి వస్తే బాగుంటుందని టీడీపీ, జనసేన కూడా కోరుకుంటున్నాయి. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ అంతగా ఆసక్తి చూపించట్లేదు. కానీ కమలంతో కలిసి ప్రయాణం చేసేందుకు టీడీపీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు సీన్ మారింది. పొత్తులపై టీడీపీ ఇంతకుముందు లాగా ఆలోచించడం లేదు. బీజేపీ పిలిచి మాట్లాడినా చంద్రబాబు తొందర పడలేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
2019లో బీజేపీతో కటీఫ్ చెప్పి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చారు. బీజేపీకి దూరమై చాలా పెద్ద తప్పు చేశామని చంద్రబాబుకు త్వరగానే అర్థమైంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటి నుంచి బీజేపీకి మళ్లీ దగ్గరయ్యేందుకు, ఆ పార్టీ నేతలను కలిసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. కానీ బీజేపీ నేతలు చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వలేదు. చివరకు దాదాపు మూడున్నరేళ్ల తర్వాత అమృతోత్సవ్ సందర్భంగా ప్రధానితో అందరితో పాటు కలిసే అవకాశం కలిగింది చంద్రబాబుకు. అదే పదివేలు అనుకున్నారు టీడీపీ నేతలు. ఆ తర్వాత కూడా బీజేపీ పెద్దలతో కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించినా అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రాలేదు.
అయితే ఇటీవల అమిత్ షా నుంచి అనూహ్యంగా పిలుపు వచ్చింది. చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్డీయే లోకి రావాలని బీజేపీ నేతలు చంద్రబాబును ఆహ్వానించినట్లు చెప్పుకుంటున్నారు. సాధారణంగా బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చి ఎన్డీయేలోకి స్వాగతించి ఉంటే టీడీపీ నేతలు ఎగిరి గంతేసి ఉండాలి. కానీ ఈ విషయంలో టీడీపీ ఎక్కడా నోరు జారలేదు. అసలు ఆ భేటీలో ఏం జరిగిందనేదానిపై ఇరుపార్టీలూ బయటకు పొక్కనివ్వలేదు. దీంతో ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం అందరిలోనూ కలిగింది. అయితే బీజేపీతో పొత్తుపై చంద్రబాబు అంత ఆసక్తిగా లేరని .. ఏదైనా ఎన్నికల తర్వాతే అని స్పష్టం చేసినట్టు సమాచారం.
బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోందనే టాక్ నడుస్తోంది. అందుకే ఎన్డీయేలోకి ఇతర పార్టీలను కూడా ఆహ్వానించాలనుకుంది బీజేపీ. అందులో భాగంగానే చంద్రబాబును పిలిచి చర్చించింది. కానీ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే ఆయనకు ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందలేదు. పవన్ కల్యాణ్ కు మాత్రం పిలుపు వచ్చింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందనుకున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ కలిసి రావట్లేదనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీని కలుపుకు పోయేందుకు టీడీపీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. బీజేపీపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉండడమే ఇందుకు కారణం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది.













