Tanuku: ఆరిమిల్లి vs కారుమూరి మాటల యుద్ధం వేడెక్కుతున్న తణుకు రాజకీయాలు..
గత నాలుగు రోజులుగా తణుకు (Tanuku) నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీ (TDP), ప్రతిపక్ష వైసీపీ (YSRCP) నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli Radhakrishna) చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నూకలు చెల్లుతాయ్” అంటూ వార్నింగ్ ఇచ్చారు. కారుమూరిని నియోజకవర్గంలో తిరగనివ్వబోమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదంతా కొన్ని రోజుల క్రితమే మొదలైంది. అప్పట్లో మీడియాతో మాట్లాడిన కారుమూరి, నియోజకవర్గ ప్రజలు ఎవరి సహాయం లేక ఖాళీగా ఉన్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహంతో స్పందించారు. అంతకుముందు తణుకు (Tanuku) లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో కూడా కారుమూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. “ఇక్కడ ఎందుకు పనికిరాని వ్యక్తి గెలిచాడు” అంటూ అన్నారు. ఇది ఎమ్మెల్యే ఆరిమిల్లి పై తీవ్ర స్థాయిలో దూషణలకు దారితీసింది.
ఆయన వ్యాఖ్యలపై ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli Radhakrishna) ఘాటుగా స్పందిస్తూ, మరోసారి కారుమూరిపై ఘర్షణాత్మక విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా కారుమూరి వర్గం, ఆరిమిల్లిపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ వర్గం మండిపడుతోంది. శుక్రవారం రాత్రి మళ్లీ మీడియా ముందుకొచ్చిన ఆరిమిల్లి, కారుమూరిపై మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. “తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే పనిలో ఉన్నారు. నోటి దురద ఎక్కువైంది, కంట్రోల్ చేయాలి. లేదంటే నూకలు చెల్లిస్తాం” అన్నారు.
ఈ వ్యాఖ్యలకు కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) వెంటనే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నూకలు చెల్లిస్తాం అంటే తనను హత్య చేయాలనుకుంటున్నారనే అర్థం వస్తోంది” అన్నారు. ఇటీవల ఎంపీటీసీ (MPTC) ఎన్నికల సమయంలో తన ఇంటిని ముట్టడి చేయడం కూడా ఆ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఎమ్మెల్యే తన గురించే రోజుకు నాలుగు గంటలు ఆలోచిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చదువుకున్న అజ్ఞానులతో తాను చర్చించనని, తాను సంస్కారవంతుడినని అన్నారు. ఈ మొత్తం వివాదంతో తణుకు రాజకీయాలు మరింత హిట్ ఎక్కుతున్నాయి.













