మంత్రి వర్గ విస్తరణకు జగన్ భయపడుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి తమకు విజయం ఖాయమని నమ్ముతోంది. గతంలో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువగా వస్తాయని, 175కు 175 సీట్లూ గెలుచుకోవాలనేదే తమ లక్ష్యమని వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకోసం తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు సీఎం వై.ఎస్.జగన్. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎన్నికైన వారిలో కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి వార్తలు వినిపించట్లేదు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జోలికి వెళ్లాలంటేనే జగన్ భయపడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులందరినీ తొలగిస్తానని చెప్పేశారు. అన్నట్టుగానే మూడేళ్ల తర్వాత మంత్రివర్గ సహచరులందరినీ తొలగించారు. కొంతమంది కొత్తవాళ్లను, మరికొంతమంది పాతవాళ్లను కలిపి మళ్లీ కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లే చివరి వరకూ కొనసాగుతారని అందరూ అనుకున్నారు. అయితే గతంలో కొంతమందికి సీఎం జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటానని మాటిచ్చారు. అప్పుడు వాళ్లు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అలాంటి వాళ్లను కొంతమందిని ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చారు జగన్. దీంతో మళ్లీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమని అందరూ భావించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలే దక్కాయి. అయినా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలను మాత్రం పూర్తిగా కోల్పోయింది. దీంతో అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమనుకున్నారు. అలాగే కేబినెట్లో సరైన పనితీరు కనబర్చని వారిపైన కూడా వేటు వేయొచ్చనుకున్నారు. ఉగాది సమయంలోనే దీనికి ముహూర్తం అని కథలుకథలుగా చెప్పుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడంపై అంతర్మథనానికే అధిష్టానం పరిమితమైంది. ఎవరిపైనా వేటు వేయలేదు.. కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్తగా కొంతమందిని కేబినెట్లోకి తీసుకోవచ్చని వైసీపీలో కొందరు నాయకులు చెప్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ జోలికి వెళ్లక పోవచ్చనే వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. అలకలు మొదలయ్యాయి. ఇలాంటప్పుడు కేబినెట్ జోలికి వెళ్తే తేనెతుట్టెను కదిపినట్టేనని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని జోలికి జగన్ వెళ్లకపోవచ్చనే వాళ్లు కూడా ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించినా పెద్దగా ఉపయోగం ఉండదని.. అలాంటప్పుడు దాని జోలికి వెళ్ళడం ఎందుకుని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కేబినెట్ పై జగన్ మనసులో ఏముందో వేచి చూడాలి.













