AP Budget: తెలుగు రాష్ట్రాల బడ్జెట్ భారీ కానీ ఖజానా మాత్రం ఖాళీ..
తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు చూస్తే అక్షరాలా లక్షల కోట్ల లో ఉన్నాయి . ప్రతీ ఏడాది బడ్జెట్ అంకెలు పెరుగుతూనే ఉన్నాయి..కానీ అభివృద్ధి మాత్రం చెప్పిన రేంజ్ లో కనపడటం లేదు. బడ్జెట్ చూస్తే తెలుగు రాష్ట్రాలు చాలా ధనికంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కానీ, మరోవైపు ప్రభుత్వం మాత్రం ఖజానా ఖాళీ అని, ఆదాయం సరిపోవడం లేదని చెబుతోంది. ఇటీవల, తెలంగాణ(Telangana ) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి. తెలంగాణా ప్రభుత్వం మాత్రం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీలో 3 లక్షల 4 వేల కోట్లకు పైగా వ్యయంతో బడ్జెట్ను ప్రకటించారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల వంటి ముఖ్యమైన రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ప్రభుత్వం ఈ బడ్జెట్ అందరికీ ఉపయోగపడేలా ఉందని చెబుతోంది.
ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రకటించింది. అయితే, ఇందులో లక్ష కోట్ల రూపాయల లోటును కూడా చూపించారు. ఈ విషయంలో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతి మంగళవారం ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) వద్ద అప్పులు తెస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంపై 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనే సమాచారం బయటకొస్తోంది.
తెలంగాణకూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా అప్పులు 7-8 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులను తగ్గించలేని పరిస్థితి ఉంది. అందుకే, అప్పులు తీసుకోవాల్సిన అవసరం పడుతోంది. అయితే, ప్రతి ఏడాది భారీ బడ్జెట్లు పెట్టడమే సరైనదా? నిధులు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద బడ్జెట్లు ప్రకటించిన తర్వాత కేంద్రం వద్ద సాయం అడగడం సమంజసమేనా? అనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ప్రభుత్వాలు ఖజానా ఖాళీ అని చెబుతూనే, మరోవైపు భారీ బడ్జెట్లు చూపించడం ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తోంది. గత పదేళ్లుగా ఆర్థికంగా నష్టపోయినట్లు చెబుతున్నా, ప్రతీ ఏడాది భారీ బడ్జెట్ ఉంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో అప్పుల భారం పెరిగిందని విమర్శిస్తోంది. ఏపీలో కూడా ఆర్థిక నష్టం గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే, అసలు విషయం ఏమిటంటే బడ్జెట్లో ప్రకటించిన ప్రణాళికలు నిజంగా అమలు అవుతున్నాయా? కేటాయించిన నిధులు సరైన విధంగా ఖర్చవుతున్నాయా? అనే విషయమే ప్రజలకు ముఖ్యమైనది. అవే నిజంగా అమలు అయితేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందని కానీ ఆ లెక్కలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితం అయితే ..రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది కలగానే మిగిలిపోతుంది.













