ప్రభుత్వ ఉద్యోగులందరికీ ABV ఒక లెసన్..!
పాలనా వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు రాజ్యాంగంలో స్పష్టమైన విధులు నిర్దేశించబడి ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులకు, కార్యనిర్వాహక వ్యవస్థ చేదోడువాదోడుగా ఉంటూ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగించాల్సి ఉంటుంది. పాలకులు తప్పు చేసినప్పుడు అధికారులు అడుగులకు మడుగులు వత్తకుండా తిరస్కరించాలి. అలా సాగినప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే ఇటీవలికాలంలో పాలకులకు అధికారులు మడుగులు వత్తడం, వాళ్లు చెప్పిన ప్రతిదానికీ తలూపుతుండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
ఏబీ వెంకటేశ్వర రావు సీనియర్ ఐపీఎస్ అధికారి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించింది. ఆ సమయంలో ఆయన వైసీపీ నేతలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు. అంతేకాక పలువురు ఎమ్మెల్యేలను టీడీపీ వైపు ఆకర్షితులయ్యేలా తెరవెనుక మంత్రాంగం నడిపారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వర రావు చక్రం తిప్పారని సహచరులే చెప్పుకుంటూ ఉంటారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
జగన్ అధికారంలోకి వచ్చాక రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో క్యాట్ కూడా సమర్థించింది. దీనిపై ఏబీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్ ను రద్దు చేసింది. దీంతో ఏబీవీకి జగన్ సర్కార్ పోస్టింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ వెంటనే అవే ఆరోపణలపై ఏబీవీని మరోసారి సస్పెండ్ చేసింది. దీనిపై క్యాట్ ను ఆశ్రయించారు ఏబీవీ. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్లకు మించి సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఏబీవీకి పోస్ట్ ఇవ్వాలని ఆదేశించడంతో ఇవాళ్ ఆయనకు పోస్టింగ్ ఇస్తూ సీఎస్ ఆదేశాలిచ్చారు.
అయితే ఏబీవీ ఐదేళ్లపాటు విధులకు దూరంగా ఉన్నారు. ఇవాళ ఆయన రిటైర్మెంట్ డే. చివరి రోజు మాత్రమే ఆయన విధుల్లో చేరాల్సి వస్తోంది. అంటే పాలకుల కక్షసాధింపు ఆయన కెరీర్ నే నాశనం చేసింది. టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంతో వైసీపీ వేధించింది. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో కొంతమంది అధికారులపై ఇదే విధంగా కక్ష సాధించే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రభుత్వోద్యోగులు తమ పరిధికి లోబడి పనిచేస్తే ఇబ్బందులుండవు. అలా కాకుండా పాలకులు చెప్పిందానికి తలూపుతూ పోతే ఇబ్బందులు తప్పవు.













