Vice Chancellors : యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల విషయంలో కూటమి సర్కార్ బోల్డ్ డెసిషన్!!
విద్యార్థి దశ నుంచే రాజకీయాలను వంటబట్టించుకున్న కాలమిది. చిన్నపిల్లలను కూడా రాజకీయ రొంపి లోకి దింపి పబ్బం గడుపుకుంటున్న వాళ్లను చూస్తున్నాం. ఇక యూనివర్శిటీల (universities) సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చదువు కంటే ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్న పరిస్థుతులు యూనివర్శిటీల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ నేతలు కూడా యూనివర్శిటీలను తమ రాజకీయ అవసరాలకోసం విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. పార్టీలకు అవసరమైన పనులను విద్యార్థులు, అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్లతో (vice chancellors) చేయించుకుంటున్నారు. పాలకుల ప్రాపకం కోసం వైస్ ఛాన్సలర్లు కూడా పాకులాడుతున్నారు.
తాజాగా కూటమి ప్రభుత్వం (NDA Govt) పలు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించింది. రాజకీయ సిఫారసులను పూర్తిగా పక్కన పెట్టి అర్హులను మాత్రమే వైస్ ఛాన్సలర్లుగా నియమించింది. ఉన్నత విద్యావంతులను, యూనివర్శిటీ విద్యపై ఎంతో అనుభవం ఉన్న వాళ్లకు బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రా యూనివర్సిటీకి (Andhra University) జీపీ రాజశేఖర్, రాయలసీమ వర్సిటీకి (Rayalaseema University) వెంకట బసవరావు, పద్మావతి మహిళా వర్సిటీకి (Padmavathi Womens University) ఉమ, కృష్ణా వర్సిటీకి (Krishna University) కె.రాంజీ, అనంతపురం JNTUకు సుదర్శనరావు, కాకినాడ JNTUకు – CSRK ప్రసాద్, నన్నయ వర్సిటీకి (Nannayya University) ప్రసన్న, యోగి వేమన వర్సిటీకి (Yogi Vemana University) ప్రకాశ్ బాబును వైస్ ఛాన్స్ లర్లుగా నియమిస్తూ గవర్నర్ (Governor) ఆదేశాలు జారీ చేశారు.
గత ఐదేళ్లలో వైస్ ఛాన్సలర్లుగా రాజకీయ అనుబంధ వ్యక్తులను నియమించింది జగన్ ప్రభుత్వం. ఇది అనేక విమర్శలకు తావిచ్చింది. పూర్తిగా రాజకీయాలకే వాళ్లు ఎక్కువ సమయం కేటాయించారు. ఆంధ్రా, ఎస్కే, ఎస్వీ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు ఫక్తు రాజకీయ నేతల్లా వ్యవహరించిన సందర్భాలను చూశాం. వాళ్ల పనితీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వైసీపీ వ్యతిరేక యూనియన్ల విద్యార్థులను ఇబ్బంది పెట్టడంతో పాటు యూనివర్శిటీలను పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకోసం వినియోగించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా నాటి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయితే కూటమి అధికారంలోకి వచ్చాక యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లంతా రాజీనామాలు చేశారు. రాజకీయ నేతల్లా వ్యవహరించడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందని చెప్తుంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను పూర్తిగా రాజకీయాలకు అతీతంగా నియమించాలని నిర్ణయించింది. అందుకే సమర్థులైన వారికోసం నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చిన అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్లలో ది బెస్ట్ అనుకున్న వాళ్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ నియమాకాల్లో కూడా మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. ఇలా రిజర్వేషన్లను పాటించింది. దీంతో వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో కూటమి ప్రభుత్వ నిర్ణయం భేషుగ్గా ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు యూనివర్శిటీలు రాజకీయాలకు అతీతంగా పని చేస్తాయని ఆశిస్తున్నారు.













