ఏపీ కోసం టాలీవుడ్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తనవంతు కార్యాచరణకు ముందుకు వచ్చిందని ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అంబికా కృష్ణ కలుసుకుని ప్రత్యేక హోద కోరుతూ తెలుగుచిత్ర పరిశ్రమ చేపట్టనున్న ఆందోళనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఢిల్లీలో తెలుగు టీవీ ఆర్టిస్టులు ఒక రోజు ధర్నా నిర్వహించడానికి ముందుకు వచ్చారని, అదేవిధంగా విజయవాడలో పాదయాత్ర చేసేందుకు తెలుగుచిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో సహా అందురూ ముందుకు వచ్చారని చంద్రబాబుకు అంబికా కృష్ణ వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ప్రత్యేక హోదా సాధన కోసం ముందుకు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమను అభినందించారు. వారు చేపట్టే ఆందోళనకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.













