ఏపీలో కొత్తగా మరో 12 జిల్లాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జిల్లాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు..25 జిల్లాలు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై రెవెన్యూ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. వైఎస్ జగన్ మ్యుమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. వీటితోపాటు కొత్తగా ఓ గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా వైసీపీ హామీ ఇచ్చింది. దీనిని కూడా కలిపితే 26 జిల్లాలు అవుతాయి.
రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పడగా.. మరో 8 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అప్పుడే వచ్చాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు, రాజధాని నిర్మాణ అవసరంతోపాటు అధికారుల కొరత కారణంగా దీనిపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. చివరికి దీనిని పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. తాజాగా లోక్సభ స్థానాలు కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని కూడా జిల్లాగా మార్చనున్నారు. గిరిజన జిల్లాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఏజెన్సీలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.













