ఈసీ కోర్టులో…
ఏపీలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పవర్ కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి పార్టీలు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పౌరుల ఓట్లను.. సాంకేతికత సాయంతో నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి పార్టీలు. అదికూడా ఆఓటరుకు తెలియకుండానే. దీంతో ఎన్నికల సమయంలో ఓటేసేందుకు వెళ్తున్న ఓటరు..తన ఓటు లేదని గగ్గోలు పెడుతున్నాడు. అయితే ఆఓటు తమ ప్రత్యర్థికి వెళ్తుందన్న దుగ్ధతో అన్నిపార్టీలు ఈ పాపంకిలానికి తెరతీస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా.. తమ ప్రత్యర్థి ఓట్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అది కాస్త తారస్థాయికి చేరడంతో .. ఈవ్యవహారం కాస్త సీఈసీకి చేరింది..
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వెళ్లి ఈసీ ఉన్నతాధికారులతో గంటపాటు భేటీ అయిన చంద్రబాబు ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉరవకొండ లాంటి ఘటనలు అన్ని చోట్లా జరుగుతాయని చంద్రబాబు ఫిర్యాదులో ప్రస్తావించారు. వాలంటీర్లతో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చంద్రబాబు ఆరోపించారు. ఒక పార్టీ ఓట్లను తొలగించాలన్న అలోచన, ఇంతవరకు ఏ పార్టీకి రాలేదన్నారు. వైసీపీ చాలా దారుణాలు చేసిందని, వాటన్నింటిని సాక్ష్యాధారాలతో ఈసీకి సమర్పించామని ఆయన తెలిపారు.
అయితే చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో వేలాదిగా దొంగఓట్లు నమోదు చేయించారని.. ఇప్పుడు వాటిని తొలగిస్తున్నామని చెబుతోంది. కుప్పంలో చంద్రబాబు సైతం దొంగఓట్లతోనే గెలిచారని విమర్శిస్తోంది. అసలు దొంగఓట్ల నమోదులో చంద్రబాబు పీహెచ్ డీ చేశారని వైసీపీనేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు.
రెండు పార్టీల ప్రయత్నాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు సాదారణ ఓటరు తమ ఓటు ఉందో లేదో అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఓటు నమోదు చేసుకున్నా.. అది ఉంటుందో, ఊడుతుందో అర్థం కావడం లేదు. దీంతో తమ ఓట్లను వేసి, నచ్చినవారిని గెలిపించే అద్భుత అవకాశాన్ని పార్టీలు… ప్రజలకు దూరం చేస్తున్నాయి. ఈ పరిణామంపై అందరూ ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మేధావులు, యువత.. ఈ అంశంపై నిరంతర నిఘా పెట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని చెబుతున్నారు. లేదంటే రౌడీలు, అరాచకశక్తులు అధికారంలోకి వచ్చి, ప్రజాస్వామ్యాన్ని చెరపట్టే దారుణస్థితికి చేరతామని హెచ్చరిస్తున్నారు.













