అమరావతి అభివృద్ధికి సహకరించండి : లోకేశ్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సహకరించాలని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ విదేశీ వ్యవహారాల రాయబారి గోపీనాథ్ పిళ్లైను కోరారు. అమరావతి నిర్మాణంలో సహకరించేందుకు సింగపూర్ ప్రభుత్వం పిళ్లైను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్‌లో భాగంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన లోకేశ్ పిళ్లైను కలిసిశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ, ఇన్నోవేషన్ కారిడార్ ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ వ్యాలీ ఏర్పాటు చేసి అనేక స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏంజెల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అందులో మా రాష్ట్రం, దేశంలోనే లీడర్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరపున స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేశాం అని చెప్పారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని పిళ్లై తెలిపారు.
అనంతరం సింగపూర్ వైల్డ్‌లైఫ్ రిజర్వ్ సీఈవో మైక్‌బార్లేతో లోకేశ్ సమావేశమయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ నిర్వహణ ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో సింగపూర్ జూ ఒకటి. ఏటా 17 లక్షల మంది ఈ జూను సందర్శిస్తారని, 315 జాతుల జంతువులు ఇందులో ఉన్నాయని బార్లే వెల్లుడించారు. లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సింగపూర్ జూ తరహాలో జంతుప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని దీనికి సహకరించాలని కోరారు.













