ఐదు ప్రధాన భాగాలుగా శాసనసభ భవనం..!
మధ్యలో సందర్శకులకు ప్రత్యేక ప్రదర్శనశాల
చల్లచల్లగా అమరావతి పరిపాలన నగరం
అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐకానిక్ భవనంగా నిర్మించే శాసనసభలో ఐదు ప్రధాన భాగాలుంటాయి. ఈ భవనం మధ్య భాగంలో ప్రజల సందర్శనార్థం ప్రదర్శన శాల (సెంట్రల్ ఆట్రియం) ఉంటుంది. దీనికి చుట్టూ మూడు మూలల్లో… శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాల్ ఉంటాయి. నాలుగో మూల బ్యాంకు, పోస్టాఫీసు, క్యాంటీను వంటి సదుపాయాలకు ఒక భవనం ఉంటాయి. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు ఎదురెదురు మూలల్లో ఉంటాయి. శాసనసభ కోసం 160 ఎకరాలు కేటాయించాలని మొదట అనుకున్నా, దాన్ని తుది ప్రణాళికలో 100 ఎకరాల్లోపే కుదించనున్నారు. పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించి 1365 ఎకరాల్లో రూపొందించిన తుది ప్రణాళికను లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈనెల 15 నాటికి అందజేయనుంది.శాసనసభ భవన తుది ఆకృతులు, హైకోర్టుకి భవనానికి సంబంధించిన కొన్ని నమూనాల్ని సిద్ధం చేస్తుంది. వచ్చే సమావేశంలో ప్రభుత్వం ఒక నమూనా ఆకృతిని ఎంపిక చేస్తే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దాన్ని చూపించి, వారి సూచనల మేరకు నార్మన్ ఫోస్టర్ సంస్థ వివరణాత్మక ఆకృతి సిద్ధం చేస్తుంది.
ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనశాల..: శాసనసభలో ప్రదర్శనశాల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనిలో కింది నుంచి అసెంబ్లీ పై భాగం వరకు వెళ్లడానికి వర్తులాకారపు మార్గం ఉంటుంది. శాసనసభ, రాజధాని చరిత్ర, పరిణామ క్రమానికి చెందిన చిత్రాలు, నమూనాలు వంటివి దీనిలో ప్రదర్శిస్తారు. సందర్శకులు వర్తులాకారపు మార్గంలో పైకి నడుచుకుంటూ వెళుతూ… వీటిని తిలకించే అవకాశం ఉంటుంది. సెంట్రల్ హాల్ ప్రాంగణంలో శాసనసభ కార్యదర్శి, ఉప కార్యదర్శుల ఛాంబర్లు, శాసనసభ పరిపాలనా కార్యాలయం ఉంటాయి.
సందర్శకులకు శీతల ప్రాంతాలు: పరిపాలనా నగరానికి వచ్చే సందర్శకులు, మరీ ముఖ్యంగా పాదచారుల కోసం ఈ ప్రాంతంలో ప్రత్యేక శీతల ప్రాంతాలు (కూల్ స్పాట్స్) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో వేసవిలో ఉండే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను ప్రణాళికలో పొందుపరిచారు.
ఉష్ణోగ్రతలు తగ్గించేదిలా…: పరిపాలనా నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నార్మన్ ఫోస్టర్ సంస్థ తమ ప్రణాళికలో ప్రతిపాదనలు చేసింది. విస్తృతంగా చెట్లు పెంచడం వల్ల 3 డిగ్రీలు, సూర్య కిరణాలు ఏటవాలుగా నేలను తాకేందుకు వీలుగా సన్ననివీధులు ఏర్పాటు చేయడం వల్ల మరో రెండు డిగ్రీలు, కాలువలు, జలాశయాలు ఏర్పాటు చేయడం ద్వారా 2డిగ్రీలు, ‘కూల్స్పాట్’ల ఏర్పాటు ద్వారా 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని పేర్కొంది.













