సింగపూర్ మాదిరిగా అమరావతి : చంద్రబాబు
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి బృహత్ ప్రణాళిక రూపకల్పన, స్టార్టప్ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో బంధాన్ని మరింత బలోపేతం దిశగా కీలక ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అమరావతిని సింగపూర్ కంటే మెరుగైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు సృష్టం చేశారు. స్టార్టప్ ఏరియా రాజధానికి గుండెకాయ అని అన్నారు. ఏపీ-సింగపూర్ మధ్య ఎన్నో సారూపత్యలు ఉన్నాయని అన్నారు. అమరావతిలో అద్భుతమైన నీటి వనరులు ఉన్నాయని, కృష్ణా నది మన రాజధానికి అదనపు బలమన్నారు. అందరూ రాజధాని నిర్మాణం అసాధ్యం అన్నారని, ఆరంభంలో కొన్ని చిక్కులు ఎదురైనా అన్నింటినీ అధిగమించామని తెలిపారు. అమరావతి అభివృద్ధికి సింగపూర్ కేవలం 6 నెలల్లోనే బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 33వేల ఎకరాలు సమీకరించామన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా అమరావతిని నిర్మించబోతున్నామని తెలిపారు.













