AP Govt: ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక..!!

దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA)లో ఒక విడతను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, ఉద్యోగులకు 3.64 శాతం కరువు భత్యం (DA)ను పెంచారు. 2024 జనవరి 1 నుంచే ఈ పెంపుదల వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా 3.64 శాతం కరువు సహాయం (DR)ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
3.64శాతం పెంపుదలతో రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటివరకు 33.67 శాతంగా ఉన్న మొత్తం డీఏ శాతం 37.31 శాతానికి పెరగనుంది. పెరిగిన డీఏకు సంబంధించిన బకాయిలను కూడా త్వరలోనే ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది, అయితే డీఏ పెంపును నవంబర్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏ విడుదల కారణంగా రాష్ట్ర ఖజానాపై నెలకు అదనంగా దాదాపు రూ.160 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన నాలుగు పెండింగ్ డీఏలలో ఒకటి విడుదల చేస్తామని ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ, పండగ సమయంలో ఈ డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తోంది.
డీఏ విడుదలతో పాటు, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవుల సొమ్మును రెండు విడతల్లో చెల్లించడం, ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకంలో ఉన్న లోపాలను 60 రోజుల్లోగా పరిష్కరించడం, అలాగే పనిచేసే మహిళా ఉద్యోగులకు రిటైర్మెంట్ వరకు వాడుకునే విధంగా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ సౌకర్యాన్ని కల్పించడం వంటి కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ చర్యలన్నీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ దీపావళిని మరింత సంతోషంగా మార్చనున్నాయి.