Ambati Rambabu: అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ..! బుక్కయినట్లేనా..?

వైసీపీ (YCP) నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) విజిలెన్స్ విచారణకు (vigilance enquiry) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు సర్కార్ సూచించింది. విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే కేసును ఏసీబీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని కక్షసాధింపు చర్యగా భావిస్తోంది వైసీపీ. అయితే వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవాళ్లందరిపైనా చర్యలు తప్పవని కూటమి పార్టీలు చెప్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు భూ కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అలాగే విద్యుత్ శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఫిర్యాదులు ఉందాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లలో భూ కన్వర్షన్ కోసం ఎకరాకు రూ.5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక ఎకరం భూమిని రూ.10 లక్షలకు కొనుగోలు చేసి దానిని ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీల ద్వారా అంబటి రాంబాబు భారీగా లబ్ది పొందినట్లు సమాచారం. మంగళగిరికి చెందిన ఒక వైసీపీ నాయకుడి నేతృత్వంలో ఈ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ప్రాంతంలో భూ కన్వర్షన్‌కు సంబంధించిన అనుమతుల కోసం అధిక మొత్తంలో లంచాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొండమోడు ప్రాంతంలో ముగ్గురాయి వ్యాపారుల నుంచి గత ఐదేళ్లలో రూ.10 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను రూ.7 లక్షలకు అమ్మినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
అంబటి రాంబాబు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనపై ఇప్పుడు ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. సోమవారం నుంచి విచారణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన సర్కార్, అక్రమాలు నిర్ధారణ అయితే ఏసీబీకి కేసును బదిలీ చేయవచ్చని సమాచారం. అయితే ఈ వ్యవహారంపై గతంలోనే అంబటి రాంబాబు స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
అంబటి రాంబాబు వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబుపై కక్షగట్టిందని, అక్రమ కేసులు బనాయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అంబటి రాంబాబు అక్రమాలపై ఫిర్యాదులు అందాయి కాబట్టే విచారణకు ఆదేశించామని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ అంబటి రాంబాబుపై విచారణలో అక్రమాలు తేలితే కేసు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించవచ్చు.