పవన్ తో సహా పలువురు నేతలపై వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై కూటమి ప్రభుత్వం పునః పరిశీలన..
ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం హయాంలో టిడిపి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సానుభూతిపరులు పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో తెలంగాణ నుంచి ఆంధ్ర కి బయలుదేరిన పవన్ ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు చోటు చేసుకున్న కీలక పరిణామాలు అందరికీ తెలిసిందే.
2024 ఎన్నికల ఫలితాలను ఒకరకంగా ఆనాటి రాత్రి తిరగరాసింది అని అందరూ భావిస్తారు. ఆ టైంలో పవన్ పై కేసు నమోదు అయింది. అనంతరం విశాఖపట్నంలోని హోటల్లో పవన్ ఉన్న సమయంలో పోలీసుల విధులకు ఆయన వల్ల ఆటంకం కలిగిందంటూ మరో కేసును కూడా నమోదు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్ర నిర్వహించిన పవన్ ఏపీలో మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి బలవుతున్నారని.. ఇందులో కొందరు వాలంటీర్ల పాత్ర ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది జనసేన మహిళా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ మేరకు గతంలో పవన్ కళ్యాణ్ ను రెండు సార్లు విచారించి నోటీసులను కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వం మారింది.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది.. దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉందని సంబంధిత లాయర్లు తెలియపరిచారు.
పవన్ కళ్యాణ్ తో పాటుగా పలువురు పైన నమోదైన కేసులను రద్దు చేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. వీటికి సంబంధించిన పలు పత్రాలను సమర్పించారు. హైకోర్టు అభిప్రాయం పరిగణంలోకి తీసుకున్న అనంతరం తదుపరి ఉత్తర్వులు ఇస్తామని గుంటూరు కోర్టు పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్.. జగన్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పలువురిపై అనేక కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కేసు వివరాలను పున పరిశీలించి నిర్ణయం తీసుకోబోతుందని తెలిపారు. వాదోపవాదాలు అనంతరం న్యాయమూర్తి దిగువ కోర్టులో కేసు విచారణను నాలుగు వారాలు నిపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.













