గెలిచారా? తలొగ్గారా?
ఏపీ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పోరాటం కొనసాగుతోంది. తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాలు .. ఎంతగా మొరపెట్టుకున్నా సర్కార్ వినకపోవడంతో.. చివరగా ఉద్యమం మొదలు పెట్టాయి. అయితే అప్పటికీ సర్కార్ నుంచి మెలికలు తప్పా, సరైన కార్యాచరణ కనిపించలేదని ఉద్యోగసంఘ నేతలు స్పష్టం చేశారు. చివరగా గవర్నర్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నా.. ఫలితం దక్కలేదు. అయితే గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతపై కేసులు నమోధయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ .. నిందితులుగా చేర్చారు.
గతంలో ఉద్యోగ సంఘాలు డీఏలు, ఇతర అలవెన్సుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవి. అంతేకాదు.. ఉద్యోగ సంఘాలు వచ్చి మాట్లాడితే ప్రభుత్వాలు సైతం వెంటనే స్పందించేవి. సమస్యల పరిష్కరానికి కృషి చేసేవి. కానీ జగన్ సర్కార్ మాత్రం.. తమ దగ్గర డబ్బులు లేవంటూ .. వారిని ఒప్పిస్తూ వచ్చింది. కొందరు మంత్రులైతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రస్తావించి.. ఆమాత్రం ఆగలేరా అని కామెంట్లు చేశారు.
సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వం దిగివచ్చి, తమ 36 డిమాండ్లను నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంతలా ఉద్యమం జరగలేదని గుర్తుచేశారు. శాఖాధిపతులు ఉద్యోగ సంఘాలతో ప్రతినెలా భేటీ అయితేనే సమస్యలు పరిష్కారం లభిస్తుందన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ప్రభుత్వం పునర్వ్యవస్ధీకరించాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసే సంఘాలకు గుర్తింపు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
అయితే.. ఇంతకూ ప్రభుత్వ ఉద్యోగులు.. దేనికోసం పోరాటం చేస్తున్నారు.. అంటే ప్రధానంగా జీపీఎస్ వద్దు. .ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు పెండింగ్ డీఏలు, బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. అసలైన డిమాండ్లు పరిష్కారం కాలేదు… కాని ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని పరిష్కారం చేస్తామన్న ప్రభుత్వం మాటలు విని… తమ ఉద్యమం సక్సెస్ అయిందని ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పడంపైనా విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగ సంఘనేతల అనైక్యత కూడా ఓరకంగా శాపంలా పరిణమించిందని చెప్పొచ్చు. సంఘనేతలకు ఒకరంటే ఒకరికి పడదు. దీంతో సంఘాలు సైతం ఒక్కపెట్టున ప్రభుత్వంపై ఒత్తిడి తేలేని పరిస్థితి ఉంది. ఇక నేతలకు ఉన్న రాజకీయ అనుబంధం కూడా .. ఉద్యోగులకు శాపంగా పరిణమించిందని చెప్పుకోకతప్పదు. సర్కార్ నిర్ణయాలను కొందరు నేతలు వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారని .. కింది స్థాయి ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.













