ఆ పరిస్థితిని ఐదేళ్లలో మారుస్తాం : జగన్
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం తరతరాలకు బాటలు చూపే పాఠమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐదేళ్లల్లో వందశాతం అక్షరాస్యతే లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం జాతీయస్థాయిలో పోలిస్తే ఎక్కువగా ఉందని, ఆ పరిస్థితిని ఐదేళ్లలో మారుస్తామనని సృష్టం చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు. బ్రిక్స్ ఎకానమీ గణాంకాల ప్రకారం కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు మనదేశంలో కేవలం 36 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. కళాశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు పూర్తిగా బోధనా రుసుములు చెల్లిస్తున్నామన్నారు. పాఠశాలలు పరిస్థితి గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.













